ఇంకో ఆరు నెలలు ప్రజలను ఏమార్చగలిగితే..మరో ఐదేళ్లు దోచుకోవచ్చన్నది బాబుగారి దురాలోచన

9–08–2018, గురువారం 
డీజేపురం, తూర్పుగోదావరి జిల్లా
ఈ రోజు పారుపాక క్రాస్, డీజేపురం గ్రామాలతో ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదయాత్ర ముగిసింది. శివారు గ్రామమైన డీజేపురానికి ఒక్క బస్సూ లేదు.. ప్రైవేటు వాహనాలూ రావు. ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. సమా చార వ్యవస్థ అంతంత మాత్రమే. ఈ మండలానికి అంబులెన్స్‌ సదుపాయం కూడా లేదు. అత్యవసర పరిస్థితి వస్తే.. ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందేనని గ్రామస్తులు చెబుతుంటే.. మనం ఏ యుగంలో ఉన్నామా.. అనిపించింది.
మధ్యాహ్న శిబిరం వద్ద ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో పనిచేసే 108 సిబ్బంది కలిశారు. అవసాన దశలో ఉన్న 108 వ్యవస్థకు పట్టిన దుర్గతిని వివరించారు. నిన్న ఇదే నియోజకవర్గంలో జరిగిన దుర్ఘటన గురించి ఆ సోదరులు చెబుతుంటే.. మనసంతా కలచివేసింది. ఇక్కడి తొండంగి మండలంలో నిన్న ఒక మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారట. ఆ మండలంలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో తుని నుంచి ముక్కుతూ మూల్గుతూ 108 వాహనం వచ్చేసరికి చాలా ఆలస్యమైందట. బాధితురాలిని తీసుకెళుతుండగా దారిలో వాహనం చెడిపోవడంతో.. మరో వాహనం రావడానికి మరింత ఆలస్యమవడం, ఈ లోపల ఆ మహిళ ప్రాణం పోవడం జరిగిపోయిందట. ఎంత దయనీయమైన పరిస్థితి! పేద ప్రజలను కనీసం మనుషులుగా కూడా గుర్తిస్తున్నట్టు లేదీ ప్రభుత్వం.
ఆ తల్లి మరణానికి ఎవరిది బాధ్యత? 108 వ్యవస్థను గాలికొదిలేసిన ప్రభుత్వానిదే కాదా? ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలుంటే.. రౌతులపూడి మండలానికి నాలుగేళ్లుగా 108 వాహనం లేదట. ప్రత్తిపాడు మండలంలో 108 వాహనం చెడి పోయి ఎనిమిది నెలలైందట. ఏలేశ్వరం వెహికల్‌ పదిరోజుల నుంచి షెడ్డులోనే ఉందట. శంఖవరం వాహనం మరమ్మతులకు నోచుకోక మూలుగుతోందట. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని వాహనాలు మొక్కుబడిగా తిరుగుతున్నా.. వాటిలో కూడా ఆక్సిజన్, అత్యవసర మందులు లేవు. ఏ వాహనానికీ ఫిట్‌నెస్‌ ఉండదు. ఎక్కడబడితే అక్కడ వాహనా లు బ్రేక్‌డౌన్‌ అవుతూ.. పేషెంట్ల ప్రాణం మీదకు తెస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నా ఈ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటే.. ఇది ముమ్మాటికీ నేరపూరిత నిర్లక్ష్యమే.
నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. రంపచోడవరం నుంచి వచ్చిన ఆదివాసీలు సంప్రదాయ కొమ్ముల తలపాగా, విల్లంబులు తెచ్చారు. అమాయక గిరిజనం అభిమానం కదిలించింది. ఏజెన్సీ ఏరియాలోని గిరిజనులు ప్రభుత్వ నిర్ల క్ష్యం వల్ల పడుతున్న కష్టాలు విని చాలా బాధనిపించింది. ఏజెన్సీలలో ఈ నాలుగున్నరేళ్లలో పౌష్టికాహార లోపంతో, విషజ్వరాలతో వేలాది మరణాలు సంభవిస్తున్నా చీమకుట్టినట్టయినా లేని బాబు.. ఎన్నికలు దగ్గరికొస్తున్న వేళ చంద్రన్న గిరిపోషణ అంటూ ఆదివాసీలపై కపట ప్రేమ చూపుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రజలను గాలికొదిలేసి, రాష్ట్రాన్ని పీల్చి పిప్పిచేసిన బాబుగారికి ఇప్పుడిప్పుడే ప్రజలు గుర్తుకొస్తున్నారు. మళ్లీ మాయ మాటలు చెప్పి, మభ్యపెట్టి ఇంకో ఆరు నెలలు ప్రజలను ఏమార్చగలిగితే.. మరో ఐదేళ్లు దోచుకోవచ్చన్నది ఆయన దురాలోచన.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ మంత్రి మండలిలో ప్రాతినిధ్యం పొందే అర్హత గిరిజనులకు లేదా? దేశం మొత్తం మీద గిరిజనులలో అత్యధిక పౌష్టికాహార లోపమున్నది మన రాష్ట్రంలోనే.. కాదనగలరా? పౌష్టికాహార లోపం తో అత్యధిక గిరిజన మాతాశిశు మరణాలు సంభవించింది మీ పాలనలోనే.. కాదంటారా? రాష్ట్రం లో ఉన్న లక్షలాది మంది గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు మీ ఈ నాలుగున్నరేళ్ల పాలనలో పౌష్టికాహారం అందించకపోవడం వాస్తవం కాదా ? రాష్ట్రంలోని 197 ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను మూసివేశారు.. వాటి స్థానంలోఒక్క కొత్త గురుకులాన్నైనా నిర్మించారా? గిరిజనుల కోసం మీ మేనిఫెస్టోలోని 25వ పేజీలో 20 హామీలిచ్చారు. ఒక్కటైనా నెరవేర్చారా?
‍వైయ‌స్ జగన్‌   

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com