– వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్ష విజయవంతం
– తరలివచ్చిన ప్రజలు
– బీజేపీ, టీడీపీ అన్యాయాలను ఎండగట్టిన పార్టీ నాయకులు
గుంటూరు: నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువభేరిలు, నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రిలే దీక్షలు, వంటా వార్పులు ఇలా అనేక రకాల ఉద్యమాలతో పోరాటం సాగించారు. ఈ క్రమంలో గురువారం గుంటూరు వేదికగా వంచనపై గర్జన పేరుతో చేపట్టిన దీక్ష విజయవంతం అయ్యింది. గుంటూరు నగరంలోని ఇన్నర్‌రింగ్ రోడ్డులోని వీఏఆర్ గార్డెన్స్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేపట్టిన నిరసన దీక్షలో వైయస్ఆర్సీపీ తాజా మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైయస్ అవినాష్‌రెడ్డి, వరప్రసాద్, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తమ్మినేని సీతారాం, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, పుష్పశ్రీవాణి, అనిల్‌కుమార్‌యాదవ్, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీలు పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు.
అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ నాయకులు నాలుగేళ్ళ క్రితం వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల సభలో హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పక్కకు నెట్టేశారు. హోదా కాదు, ప్యాకేజీ అంటూ ప్లేటు ఫిరాయించారు. వైయస్ఆర్ సీపీ ఎంపీలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. చివరకు పదవులకు రాజీనామా చేసి హోదా ఉద్యమాన్ని ఢిల్లీకి తాకించారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకుని ప్రజలను మరోసారి వంచిస్తోంది. ఈ మోసాలను ప్రజలకు వివరించి.. హోదా గళం వినిపించేందుకు వంచనపై గర్జన పేరుతో సింహనాదం చేశారు. హోదాపై ప్రజలను చైతన్యవంతం చేశారు.
Be the first to comment