బాబుగారి రుణమాఫీ హామీని నమ్మడమే.. వారు చేసిన నేరమా?

250వ రోజు పాదయాత్ర డైరీ

30–08–2018, గురువారం  
వూడేరు క్రాస్, విశాఖపట్నం జిల్లా
నడుస్తూ.. నడుస్తూ ఉండగానే 250 రోజులు గడిచిపోయాయి. చూస్తూ.. చూస్తుండగానే లక్షలాది మంది ప్రేమాభిమానాల మధ్య, కన్నీటి వెతల మధ్య పాదయాత్ర తొమ్మిదో నెలలోకి ప్రవేశించింది. చలి వణికించినా.. ఎండలు మండినా.. జడివానలు జడిపించినా.. అంతులేని ఆప్యాయతను చూపుతూ.. తమ బిడ్డలా అక్కున చేర్చుకున్న ఆత్మీయుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు వెలిగించాలన్న నా సంకల్పం మరింతగా బలపడటానికి ప్రజా సంకల్ప యాత్ర దిక్సూచి అవుతోంది.
ఈ రోజు పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గంలోని మార్టూరి క్రాస్, బవులవాడ క్రాస్, త్రిమూర్తులు నగర్, దర్జీనగర్‌లలో సాగింది. అనకాపల్లి పేరు చెబితేనే బెల్లం గుర్తుకొస్తుంది. దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌. కానీ నేడు గిట్టుబాటు ధరల్లేవు.. రకరకాల ఆంక్షలు.. దళారీల దోపిడీ.. వెరసి బెల్లం తయారీ మానేసి రైతన్నలు వలస బాటపడుతున్నారు. పొట్టకూటి కోసం భవన నిర్మాణ కార్మికులుగా మారిన జమాదులపాలెం రైతన్నల దుస్థితే దీనికి నిదర్శనం. అనకాపల్లి బెల్లం వైభవం.. గత చరిత్రగా మిగిలిపోతుందేమోనన్న ఆందోళన రైతన్నల్లో కనిపిస్తోంది.
బాబుగారిని నమ్మి మోసపోయానంటూ వాపోయాడు కొయ్యలాడ పైడిరాజు. ఆయన రూ.70 వేల పంట రుణం తీసుకున్నాడు. చంద్రబాబు రుణమాఫీ హామీని నమ్మి వాయిదాలు కట్టడం ఆపేశాడు. మాఫీ మాయ అని తెలిసింది. వడ్డీతో కలిపి రుణం రూ.1.48 లక్షలైంది. భూమిని జప్తు చేస్తామంటూ బ్యాంకు వారు నోటీసులిచ్చారు. అప్పు కట్టలేడు.. భూమిని వదులుకోలేడు.. పైడిరాజు ఏమైపోవాలి?రుణమాఫీ కాక, అప్పుల బాధ ఎక్కువై ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రామయ్య, వండ్రమ్మల ఉదంతాన్ని పేపర్లో చూశాను. వారు చేసిన తప్పేంటి? బాబుగారి రుణమాఫీ హామీని నమ్మడమే వారు చేసిన నేరమా?
కరువు కాటకాలతోనో, అకాల వర్షాలతోనో పంట దెబ్బతిని బలవన్మరణాలకు పాల్పడ్డ అన్నదాతలను చూశాం. ఇతరత్రా కారణాలతో వ్యవసాయం గిట్టక తనువు చాలించిన కర్షక సోదరులనూ చూశాం. ఏలినవారి కర్కశత్వానికి, నిరాదరణకు గురై ప్రాణాలు తీసుకున్న రైతుల దుస్థితినీ గతంలో ఇదే చంద్రబాబు పాలనలో చూశాం. మళ్లీ ఇప్పుడు అదే పాలకుడు చేసిన రుణమాఫీ మోసానికి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం. ఇలా బాబుగారి పాలనలో తప్ప.. మునుపెన్నడూ జరగలేదన్నది అక్షర సత్యం.   ఈ రోజు పాదయాత్రలో ఒక్క తుమ్మపాల సహకార చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించే ఐదు వినతిపత్రాలు అందాయి.
దాదాపు 300కు పైగా కార్మికులకు, ఉద్యోగులకు 48 నెలలుగా జీతాల్లేవు. ఫ్యాక్టరీ మూతపడ్డ ఈ నాలుగేళ్లల్లో పలు రకాల ఇబ్బందులతో 39 మంది కార్మిక సోదరులు మరణించారు. 154 మంది విశ్రాంత ఉద్యోగులకు ఎటువంటి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందడం లేదు. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడిన 13 వేలకు పైగా రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఒక్క ఫ్యాక్టరీ మూతపడటం వేలాది కుటుంబాలపై పెను ప్రభావం చూపుతోంది. చాలా బాధేసింది.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ వల్ల రాష్ట్రంలోని ఎన్నో సహకార ఫ్యాక్టరీలు, డెయిరీలపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు వీధినపడ్డాయి. మీ ఒక్కరి స్వార్థమే కారణమంటున్న ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు? మీ వల్ల రుణ ఉపశమనం కలుగకపోగా లక్షలాది మంది రైతన్నలకు అప్పుల భారం మరింత పెరిగిపోయింది. మరి అది రుణమాఫీ ఎలా అవుతుంది? మోసం కాక మరేంటి?
-వైయ‌స్‌ జగన్‌ 

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com