ప్ర‌జాద‌రణ చూసి ఓర్వలేక ఎల్లోమీడియా దుష్ప్రచారం

– వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు త‌మ్మినేని సీతారాం

-ఏడేళ్ల తర్వాత భారతి పేరును చార్జిషీట్‌లో ఎలా పెడతారు
-చార్జిషీట్‌లో తన పేరును పెట్టిన విషయం ఆమెకు తెలియకముందే.. ఎల్లో మీడియాకు ఎలా లీకైంది
– ఈ కేసును టీడీపీ అభిష్టానికి అనుగుణంగా బీజేపీ వాడుకుంటోంది
– ఓటకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినా చర్యలు ఏవి?
– ఓటకు కోట్లు కేసులో అన్ని సాక్షాలున్నా కేసు ముందుకు సాగడం లేదు
– బీజేపీ అగ్రనేతలతో బాబుకు ఫెవికాల్‌ బంధం ఉంది
విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ కేసుల కుట్రకు తెరలేపుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న ఉమాశంకర్‌గౌడ్, గాంధీ అనే ఇద్దరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. వైయస్‌ జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. భారతీ సిమెంట్స్‌కు సంబంధించిన వ్యవహారంలో వైయస్‌ జగన్‌ సతీమణి వైయస్‌ భారతిరెడ్డిని పేరును ఈడీ దాఖలు చేసిన చార్జీషీట్‌లో చేర్చడాన్ని తమ్మినేని తీవ్రంగా ఖండించారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తమ్మినేని సీతారాం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తనపై వ్యక్తిగత కుట్ర జరుగుతుందని, చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు రాజకీయ నాయకులకు తలొగ్గి కుయుక్తులు చేస్తున్నాయని, చర్యలు తీసుకోవాలని 2017 ఫిబ్రవరిలో ప్రధాని రేంద్రమోడీ దృష్టికి వైయస్‌ జగన్‌ తీసుకువెళ్లారని త‌మ్మినేని సీతారాం గుర్తు చేశారు. టీడీపీ మాజీ ఎంపీ దేవేందర్‌గౌడ్‌ మేనళ్లుడు ఉమాశంకర్‌గౌడ్‌ చంద్రబాబుకు ఏజెంట్‌గా పనిచేస్తున్నారన్నారు. గాంధీ అనే అధికారికి మూడు పర్యాయాలు ఎక్స్‌టెన్షన్‌ ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు. పదవి పొడిగించడం కూడా బీజేపీ, టీడీపీ అనుగుణంగా వాడుకుంటుందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఏడేళ్ల తరువాత భారతీ సిమెంట్‌పై ఆరోపణలు చేస్తుందని, ఎలాంటి అవినీతి జరగకపోయినా జరిగినట్లుగా చూపించడానికి టీడీపీ, దాని అనుబంధ మీడియా ప్రయత్నిస్తుందన్నారు. భారతీ సిమెంట్‌ సంస్థలో మెజార్టీ వాటాను ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ సిమెంట్‌ దిగ్గజం వికా కంపెనీ కొనుగోలు చేసిందని, పన్నులు కట్టి తీసుకున్న డబ్బు ఏరకంగా అవినీతి సొమ్ము అవుతుందో చెప్పాలన్నారు. దీనిలో చట్టబద్ధం కానిది ఏముందో ఎల్లోమీడియా చెప్పాలని డిమాండ్‌ చేశారు.
తెలుగుదేశం పార్టీ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో చాటుమాటు మంతనాలు జరుపుకుంటూ వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు బనాయించిందని తమ్మినేని ధ్వజమెత్తారు. 2011 ఆగస్టు 10న కేసు ప్రారంభమైతే.. ఏడేళ్ల తరువాత ఆయన సతీమణి వైయస్‌ భారతి మీద కూడా ఈడీ చార్జిషీట్‌ వేస్తుందంటే ఇంతకంటే దిగజారుడు తనం ఏముంటుందో అర్థం చేసుకోవాలన్నారు. వైయస్‌ జగన్‌పై కేసులు వేయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు. 90 రోజుల్లో బెయిల్‌ ఇవ్వాల్సి ఉన్నా.. చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి 16 నెలలు జైల్లో ఉంచారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు ఎజెండా ఒక్కటే… ఎట్టిపరిస్థితిలో వైయస్‌ జగన్‌ను ఏదో ఒక విధంగా కేసుల్లో ఇరికించాలనే దురుద్దేశమేనని బయటపడిందన్నారు.
చంద్రబాబుకు మగతనం ఉంటే ప్రజాక్షేత్రలో తేల్చుకుందాం రావాలని తమ్మినేని సవాలు విసిరారు. చంద్రబాబు ఎజెండా వైయస్‌ జగన్‌ను రాజకీయంగా అడ్డుకోవడమే కదా.. రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెబుతారు.. దాని కోసం చంద్రబాబు లేనిపోని వ్యవహారాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. సంస్థలను, వ్యవస్థలను వైయస్‌ జగన్‌ కుటుంబానికి వ్యతిరేకంగా ఉపయోగించడం తగదన్నారు.
చంద్రబాబు రెండు అంశాలనే ఎజెండాగా పెట్టుకొని కుట్రలు చేస్తున్నాడని తమ్మినేని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఓటుకు కోట్ల కేసులో నేరుగా ఆడియో.. వీడియో సాక్షాలున్నా కేసులను విచారణ రాకుండా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి తనను తాను కాపాడుకోవడం.. వైయస్‌ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్ష నేతపై, ఆయన కుటుంబంపై అక్రమంగా కేసులు బనాయించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడన్నారు. రెండే లక్ష్యాలుగా కేంద్రంలోని పార్టీలతో 2009 నుంచి ఇప్పటి వరకు తెరవెనుక ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరు చూస్తున్నారన్నారు. వైయస్‌ భారతిని చార్జిషీట్‌లో చేర్చాలని ఈడీ వాదన చేయడం వెనుక చంద్రబాబు ఆయన పిరికి రాజకీయం ఉందని తేలిపోయిందన్నారు. ధైర్యంగా సమస్యలపై పోరాడాలి కానీ.. వ్యక్తులను టార్గెట్‌ చేసి పనికిమాలిన కేసులు వేయడం మంచిది కాదన్నారు.
జాతీయ, అంతర్జాతీయ సంస్థలు చేసిన సర్వేలు ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో మొదటి స్థానంలో నిలిచిందని తమ్మినేని గుర్తు చేశారు. కాగ్‌ వేదికలో చంద్రబాబు సంగతులు ప్రస్తావించాయన్నారు. ఇవన్నీ విచారణకు ఎందుకు వెళ్లడం లేదని గమనిస్తే వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ కనిపిస్తుందన్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి సుజనా చౌదరిని కేంద్రమంత్రిగా చేశారని, అక్కడ సుజనాచౌదరి పని అదేనన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేరుగా ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి చెప్పుచేతల్లో ఉంటాయని, వైయస్‌ జగన్‌ ఎప్పుడూ ఎవరికీ లొంగలేదు కాబట్టే చంద్రబాబు బీజేపీతో కలిసి అక్రమ కేసులు బనాయిస్తున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీకి రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గట్కరీ, మహారాష్ట్ర బీజేపీ సర్కార్‌తో, నిర్మలా సీతారామన్‌తో బలమైన ఫెవికాల్‌ బంధం ఉందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి అలాంటి అవసరం లేదని, నిజాయితీగా ప్రజల కోసం పోరాడుతాం.. నిలబడతామన్నారు. కేంద్రమంత్రులే చంద్రబాబుకు మాకు శాశ్వత మిత్రుడని చెబుతున్నారన్నారు. ఏనాడూ ప్రభుత్వంలో లేని వైయస్‌ జగన్‌ను విచారణకు లాగి వేధిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ బెదరకపోవడంతో ఆయన కుటుంబసభ్యులను వేధిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీతో చాటుమాటు సంసారం కారణంగానే చంద్రబాబు కుంభకోణాలు అన్ని ప్రెస్‌మీట్లకే పరిమితమయ్యాయి. టీడీపీ కూడా ఉత్తుత్తి ప్రెస్‌మీట్లతో కాలం గడుపుతోందన్నారు. అవినీతి ఆరోపణల మీద ఓటుకు కోట్ల కేసు నుంచి మొదలు పోలవరం, రాజధాని, కేంద్ర నిధుల దుర్వినియోగం, ఉపాధి హామీ, లంచాలు అన్నింట్లో చంద్రబాబు మీద ఈగ వాలనివ్వకుండా.. విచారణ జరగనివ్వకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఏడేళ్ల తరువాత భారతి పేరును చార్జిషీట్‌లో ఎలా పెడతారని, ఆమెకు కూడా తెలియముందే ఎల్లో మీడియాకు సమాచారం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
తన రాజకీయ వ్యవహారాల కోసం చంద్రబాబు త్వరలోనే టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రయత్నంలో ఉన్నారని తమ్మినేని ఆరోపించారు. అందుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవి ఓటింగ్‌ నిదర్శనమన్నారు. రాజ్యసభలో టీడీపీ కాంగ్రెస్‌కు ఓటేసిందని, వైయస్‌ఆర్‌ సీపీ ఓటింగ్‌కు దూరంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్, హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేశాయని ఓటింగ్‌లో పాల్గొనలేదన్నారు. ఐదేళ్ల కాదు పదేళ్లు హోదా ఇస్తామని బీజేపీని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వైయస్‌ జగన్‌ మానసిక సై్థర్యం దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే ఏడేళ్ల తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా మహిళపై చార్జిషీట్‌ ఫైల్‌ చేయిస్తారా..? అని నిలదీశారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని, ఇంతకు ముందు కూడా నిర్బంధించాలని చూశారని, కానీ వైయస్‌ జగన్‌ ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. సాక్షి దినపత్రిక ఎలాంటి ఒత్తిడులకు, బెదిరింపులకు తలొగ్గకుండా ముందకు దూసుకుపోతుందని, ప్రభుత్వం చేసే అరాచకాలు, అక్రమాలు, మాఫియాలను నిర్భయంగా జనం పక్షాన నిలబడి చెబుతుంది కాబట్టే వైయస్‌ భారతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com