దుర్గమ్మ ఆగ్రహానికి బాబు బ‌లికాక తప్పదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాసులు

బెజవాడ కనకదుర్గ ప్రతిష్టను దిగజార్చుతున్నారు
క్షుద్రపూజలపై నేటికీ చర్యలేవీ? 
కంటితుడుపు చర్యగా ఈఓలను బదిలీ చేయడం చేతులు దులుపుకోవడం
బుద్ధా వెంకన్న కనుసన్నల్లో ఆలయ నిర్వహణ
విజయవాడ: బెజవాడ కనకదుర్గ ఆగ్రహానికి చంద్రబాబు బలికాక తప్పదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాసులు ఆరోపించారు. అరాచక కార్యక్రమాలతో చంద్రబాబు దుర్గగుడి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని ధ్వజమెత్తారు. గుడిలో క్షుద్రపూజలు చేయించడం, అమ్మవారి చీరలు దొంగలించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం వంటి చేష్టలు బాధాకరమన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాసులు పార్టీ నేత మల్లాది విష్ణుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గగుడి పాలక మండలి సభ్యులు కొంతమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఒక సభ్యుడు నాయీ బ్రాహ్మణుల మీద చేయి చేసుకోవడం.. మరో సభ్యురాలు చీర దొంగతనం చేయడం అనేక అరాచకాలు జరుగుతున్నాయన్నారు.
డ్యాష్‌బోర్డు ద్వారా శ్రీకాకుళంలో వీధి దీపం వెలగడం లేదని చెప్పగలిగే చంద్రబాబుకు పక్కనే ఉన్న దుర్గగుడిలో జరుగుతున్న అన్యాయాలు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తే కంటితుడుపు చర్యగా ఈఓలను బదిలీ చేసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు జరిగాయని విజయవాడ నగర కమిషనర్‌ చెప్పారని, అప్పటికప్పుడు ఈఓను బదిలీ చేస్తున్నట్లుగా డ్రామాలు ఆడి సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌గా నియమించారన్నారు. ఆ తాంత్రిక పూజలు లోకేష్‌ కోసం చేయించారని అందరికీ తెలిసిపోతుందనే భయంతో కమిషనర్‌ పదవి కట్టబెట్టారని దుయ్యబట్టారు. దుర్గమ్మ ఆలయంలో జరిగిన క్షుద్రపూజలపై ఇప్పటి వరకు నివేదిక బయటపెట్టిన దాఖళాలు లేవన్నారు. అదే విధంగా చీరల మాయం విషయంలో కూడా ఈఓను బదిలీ చేసి, సభ్యురాలిని తొలగించామని చెబుతున్నారు కానీ ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని నిలదీశారు.
దుర్గగుడి దేవస్థానం నిర్వహణ అంతా టీడీపీ నేత బుద్ధా వెంకన్న కనుసన్నల్లో నడుస్తుందని వెల్లంపల్లి శ్రీనివాసులు ఆరోపించారు. పార్కింగ్, దుకాణాలు, కొబ్బరికాయలు అన్నింట్లో డబ్బులు దండుకుంటూ అమ్మవారి పవిత్రతకు భంగం కలిగిస్తుంటే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. క్షుద్రపూజల విషయం బయటపడుతుందని బుద్ధా వెంకన్నకు చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే ఇప్పటి వరకు చర్యలు లేవు.. చంద్రబాబుకు దేవాలయాలు, పుష్కరాలు, దేవస్థానం భూములు వేటి మీద నమ్మకాలు, విశ్వాసం లేవని, కేవలం పబ్లిసిటీ కోసమే చూస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబుకు దుర్గమ్మ తగిన బుద్ధి చెబుతుందన్నారు.
యనమల వ్యాఖ్యల్లో వాస్తవాలు లేవు..
రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ నిసిగ్గుగా లాలూచీ రాజకీయాలు చేస్తుందని వైయస్‌ఆర్‌ సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సతీమణి వైయస్‌ భారతి మీద వచ్చిన అభియోగంపై జననేత బహిరంగ లేఖ రాశారన్నారు. లేఖపై స్పందించిన యనమల రామకృష్ణుడు అవాస్తవాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యను టీటీడీ పాలక మండలి నుంచి ఎందుకు తొలగించలేదో సమాధానం చెప్పాలన్నారు. లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చంద్రబాబు ఎప్పటికీ మా మిత్రుడన్న వ్యాఖ్యలకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయమని ఎందుకు నోరు విప్పలేదన్నారు. అవాస్తవాలనే సత్యాలుగా మాట్లాడడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

Related Post

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


www.000webhost.com